Tuesday, 26 April 2011

కబుర్లు



ఇందులో నా చిన్న నాటి సంగతులు కొన్ని చెబుతానే..
అప్పుడు నాకు పదేళ్ళేమో..
ఓ సారి తిరుపతెళ్ళాం..
వేంకటేశ్వరస్వామిని అలివేల్లు మంగమ్మనూ దర్శించుకున్నాం..
అలివేలు మంగమ్మ అభయముద్రను చూసిన నాకు ఆమె తన చేతి నాలుగు వేళ్ళనూ కిందకీ పైకీ ఇలా ఇలా అని నన్ను రా..రమ్మని పిలిచినట్లనిపించింది..
అదే..అమ్మతో చెప్పాను అలివేలు మంగమ్మ నన్ను సైగ చేసి రారమ్మని పిలుస్తూంది అని
అందరూ ఒకటే నవ్వులు..







మా అవ్వ వుండేది గుడిపాటవ్వ..
వాళ్ళ వూరు గుడిపాడు..అందుకని ఆమెను గుడిపాటవ్వ అని పిలిచే వారట..
ఆమెకు పిల్లలు లేరు..
మా అమ్మకు నేను ఐదవ సంతానం మా అమ్మ నన్ను కనేసి మా అవ్వ చేతులలో పెట్టేసింది..ఎందుకంటే..అదే సమయానికి మా అక్కలూ కానుపుకు వచ్చేసారనమాట.అంటే మా అమ్మ కూడా మా అక్కలతో పాటూ కనింది నన్ను.భలే తమాషాగా వుంది కదూ..అవును మరి ఆ కాలంలో ఆపరేషనులూ పాడూ లేవు మరి.ఆడవారు బహిష్టులు పోయేవరకూ అలా కంటూనే వుండేవారు.మా అమ్మకు ఏడుగురు సంతానం. ఆ కాలంలో ఎలా పెంచేవారో పాపం కదూ.
అలా.. మా అక్కలు వచ్చే సమయానికి నాకు రెండునెలలుట.తెల్లగా ముద్దుగా..బొద్దుగా..మరి నేను పాపం వుండేదాన్నిట.అక్కలూ బావలకు సేవలు చేయడానికి అమ్మ రెడీగా వుండాలిగా..అందుకని మా అమ్మ నన్ను మా అవ్వ నన్ను మా అవ్వకు అప్పజెప్పింది..మా అవ్వ వాకిట్లో నులకమంచమేసుకొని దాని కాళ్ళకు చీర వుయ్యాల కట్టి అందులో నన్ను పడుకో పెట్టి పాటలు పాడుతూ ఊయలూపేదిట..మా అమ్మకు పాలిచ్చే తీరిక కూడా ఉండేది కాదుట..అమ్మా అమ్మా ..పిల్లకు పాలియ్యమ్మా
..ఏడుస్తూంది..అని మా అవ్వ అంటే అమ్మో ..అక్కలో ఎవరొ ఒకరు నాకు పాలిచ్చే వారుట.అలా నేను ముగ్గురి పాలు తాగి పెరిగాను ..అన్నట్లు మా అక్కలకు ఇద్దరికీ మగపిల్లలు పుట్టారు.వారికీ నాకూ రెండు నెలలే తేడా..
బాగుందా..నా జన్మ వృత్తాంతం..
మరీ ఇంకో విషయం మాట్లాడుకుందాం..బై..


                               ***
 ఇంకో ముచ్చట..

పానీ పూరి తిందామని వెళ్ళాను..
అతను నాకు మంచి ఫ్రెండు..ఇద్దరు కొడుకులు ఓ కూతురూనట.అతను ఆరు లక్షలకు ఈ హైదరాబదు సిటీలో ఇల్లు కొన్నాడు.నాలుగెకరాలపొలం ఊరిలో కొన్నాడు.ఎలా అంటారా..?అతను పొద్దున్నే ఉల్లిపాయలు బండిలో వేసుకొని నాలుగు వీధులూ తిరిగి అమ్ముతాడట.దానిమీదో అయిదువందలు రోజుకు ఆదాయమట.సాయంత్రం పానీ పూరీ బండి.ఇంకో చెరుకు బండి అతని భార్య నడిపిస్తుంది.దానిమీదో ముఫైవేలు సీజన్ లో మిగులు.ఇంకో బండిపై మిరపకాయ బజ్జీలు పెడదామని ఆలోచిస్తున్నాడట.
మొత్తానికి ఖర్చులుపోను నెలకు అతని సేవింగ్స్ పదిహేనువేలు..
చూసారా..
శ్రమైక జీవన సౌందర్యం..
అతని కూతురు ఇంటరు 75%తో పాసైంది..
కొడుకులిద్దరూ బానే చదువుతున్నారు..
మన మధ్య తరగతి భేషజాలకి కాలర్ నలగని జాబులలో చాలీచాలనిజీతాలతో..జీవన పోరాటం 
నాకు పుష్పక విమానంలో కమల్ హసన్ గుర్తొచ్చాడు సుమండీ..
అందులో చాయ్ లో నాణేలు వేసుకొని కమల్ చాయ్ తాగుతాడు..
రోడ్డుమీది ముష్టివాని పట్ట కింద బోలెడు డబ్బులు..
భలే బాగ వుంది ఆ సినిమా..
కమల్ మధ్యలో అడ్డదారిలో ధనవంతుని బంధించి హోటల్ పుష్పక్ లో సుఖాలు అనుభవించినా ..చివరికి అతని సంసారం చక్కదిద్ది..తనూ మంచి ప్రేమ అనుభవాన్ని పొందుతాడు..
చివరికి ఆ హోటల్ యజమాని ఆ స్థాయికి ఎలా ఎదిగాడని అంచెలంచెలుగా ఉన్న ఫోటోలు తెలుపుతాయి
కానీ మనం అలా ఉల్లిపాయలు అమ్మలేమనుకొండీ..
కానీ తల్లిదండ్రులు కష్ట పడి చదివిస్తున్నందుకు పిల్లలైనా బాగా చదివితే సంతోషం..కదూ..


మా పిల్లలు కుక్కని పెంచుకుందామని ఒకటే పోరు..
వద్దురా..మళ్ళీ దానికీ చేయలేక నేనే చావాలి అని నేనూ.
ఓ సారి పా రెండవ వాడు తెల్లని బుజ్జి కుక్క పిల్లని తెచ్చాడు..
మనింట్లూ పెట్టుకుందాం అని నస..సరే ఈ ఒక్క రోజూ వుండనీ అని అన్నా..
కొంతసేపు ఆడి వాళ్ళు కిందకి ఆడుకోవటానికి వెళ్ళారు..
ఇక ఇది ఒకటే అరుపులు ..దాన్ని పట్టించుకోవట్లేదని..
పాలు పెడితే చక్కగా తాగింది..
మళ్ళీ అరుపులు..
ఇంట్లో పనిలో ఉన్న నేను ..బాల్కనీకి వచ్చి ఏయ్ ..అరవకు .. అంటే నన్ను చూసి బుజ్జి బుజ్జిగా..కుయ్ ..కుయ్..మంటూ..మూల దాక్కోవటం..నేను వెళ్ళగానే మళ్ళీ అరవటం..
అసలు మన ఫీలింగ్స్ అన్నీ యెంతబాగా అర్థం చేసుకుంటాయో..అవి..చంటిపిల్లల్లానే..
దగ్గరికి వెళ్తే తోకాడిస్తూ మనని రాసుకు తిరగటం..
అందుకే చాలా మంది పెంపుడు జంతువులని కన్న బిడ్డల్లా ప్రేమిస్తారు..అవి విశ్వాసంగా వుంటాయి మరి.
ఒక్క రోజు దాన్ని అలా వుంచేసుకున్న నాకే దాన్ని వదలబుధ్ధి కాలేదు కాని బలవంతంగా పిల్లలనుంచి దాన్ని వేరు చేయాల్సి వచ్చింది..






మా నాగ పద్మిని అక్కయ్య అప్పుడు రేడియోలో కొత్తగా ఉద్యోగంలో చేరింది..
మా మిద్దే పైన ఓ రామ చిలుక గాయపడి పడిఉండటం చూసాం..
వెంటనే మా ఆస్థాన వైద్యుడు గుర్రప్ప పిలిపించబడ్డాడు..
దానికి అతను తనకు తెలిసిన చికిత్స చేశాడు..
అది కొద్దిగా కోలుకుంటున్నట్లే కనిపించింది..పాపం..
హాలు మధ్యలో ఓ పంజరంలో దాన్ని వేలాడదీసాం..
మా ఇంట్లో ఎప్పుడూ..వచ్చే జనాలూ ..పోయే జనాలూ..
కవులూ పండితులూ..జ్యొతిష్యులూ..భక్తులూ..
అమ్మ రామాయణ పారాయణాలూ..రామ పట్టాభిషేకాలూ..
అయ్య సన్మానాలూ..పండితగోష్టులూ..
చిలకకు ఎప్పుడూ హడావుడే..
అందరూ దాన్ని పలకరించే వారే..
అదీ అమ్మకు  రామ రామలూ..అయ్యకు కృష్ణ..కృష్ణలూ 
బాగానే మాట్లాడేది..నాగ ఆఫీసునుండి వచ్చీ రాగానే గేటు వేయడం తరువాయి ఇంట్లోకి ఒక్క పరుగున వచ్చేసేది..నేనూ అంతే గేటు వేసీ వేయడంతోనే..
పరుగెత్తుకుంటూ ఇంట్లోకి రావడం.

ఎందుకట్ల పరుగెత్తుకుంటూ వచ్చేది..మెల్లగా రాలేరా..అనేది మా అమ్మ.
వచ్చీ రావడంతోనే అమ్మా..అంటూ అమ్మ వడిలో ముద్దులు పడడం అంతా బాగుంటారు..నా దగ్గరకు వచ్చేసరికి ఇలా అనేది అమ్మ నవ్వుతూ..
ఓ సారి ఇంట్లో సున్నం కొడుతున్నాం. ఆ ఘాటుకి చిలకకి మళ్ళీ జబ్బు చేసింది..
మళ్ళీ గుర్రప్ప తన వైద్యం తాను చేసాడు..కానీ చిలక అసువులు బాసింది..
మా పవిత్రమైన ఇంట్లో కొద్ది రోజులు గడిపే భాగ్యం దానికి ఉంది పాపం మరి..
దాన్ని పట్టుకుని మా నాగ ఒకటే ఏడుపు..
ఏంటో నా హృదయం బరువెక్కింది..
ఉంటా..






Monday, 25 April 2011

కథలు



కొంగుముడి..

"పిల్లాడి పేరేంటి..?"
"మహేష్.."
"యేం..చేస్తాడు..?"
"యేదో కంపెనేలో ఎలక్ట్రికల్ ఇంజనీర్.."
"వస్తా..ఆంటీ.."
"వుండు పిల్ల..యేంటి విశేషాలు.."
"యేం లేదు..అతను నిన్న ఫోన్ చేసాడు.."
తలవంచుకొని అంది..
"ఆ..ఆ..ఇంతమంచి మిడ్ నైట్ మసాలాను చెప్పకుండా జారుకుందామనుకున్నావా..?"
"ఊ..చెప్పు..యే మన్నాడు..?"
"మా నాన్నగారు తేసారు..నా దగ్గరికి వచ్చి 'వెళ్ళు..నేకే..' అన్నారు.."
గాయత్రి బుగ్గలు సిగ్గులు పూస్తున్నాయి..
'యెవరూ' అన్నా..
"నేనే యేం చేస్తున్నారూ.. అన్నాడు."
"అప్పుడు మా పెదనాన్న గారమ్మాయి..మా అక్క వున్నారాంటీ అదే చెప్పాను..."
"తర్వాతా.."
'టపాసులు కాల్చారా..'అన్నాడు..
"వూ..అన్నా.."
"యేం కాల్చారు.. అన్నాడు.."
"యేముందీ..చిచ్చుబుడ్లూ..కాకర పువ్వోత్తులూ.."
"బాంబులు కాల్చలేదా..?అన్నాడు.."
"పెళ్ళయ్యాక కాల్చి చూపిస్తాగా..ఇక రోజూ..అవే..అనక పోయావా...
అబ్బాయికి జ్వరం వచ్చి వుండేది.."
పక పకా నవ్వింది గాయిత్రి సంతోషంగా..
"'మీ అక్క కొడుకు చాలా అల్లరనుకుంటా..'అన్నాడు.."
"యేం..బాపూ...రమణల కార్టూన్లోలా మే ఆయన నెత్తిమేద యెక్కి కూచున్నాడా యేంటి..?యేయ్ నేకు బాపూ జోక్స్ తెలుసా..?
ఇంటికి చుట్టాలొస్తారూ..మావాడు చాలా అల్లరండీ అంటుంది ఇంటావిడ కూల్గా..ఒక్కటే డైలాగ్ పిల్లాడు చుట్టం మెడలెక్కి కూచున్నట్లు..బొమ్మ..బిత్తరపోయిన చుట్టం.."
పగలబది నవ్వింది సుచిత్ర..
"గాయత్రి నవ్వుతూ..లేదాంటీ..కాస్త అల్లరి చేసాడంతే.."
అంది..
"తర్వాతా.."
"నంబరిచ్చాడు..నన్ను చైమని.."
"చేసావా..?"
"లేదాంటీ.."
"ఆ..చేసేవుంటావు..అందరూ నిద్దరోయాక యే పదకొండుకో..రహస్యంగా..నంబరు తిప్పేవుంటావ్.."
"లేదాంటీ.."
"ఇన్నళ్ళూ..బుధ్ధిగా వున్నావ్..ఇప్పుడన్న.. కాస్త బరి తెగించవే పిల్లా..
తూహై హసీనా..మేహూ దివానా..ఓ జానే జానా..యేతో బతానా..ఐసీ అకేలీ రాతోమె ముఝే..నీంద్ న ఆయే క్యా కరూ..
అర్థం తెలుసా.."
"తెలుసాంటీ..నా సెకండ్ లేంగ్వేజ్ హిందీయే...."
"భలే..వుంది కదూ..పాట.."
"వూ.."
"'మీ వాళ్ళు బయటకు పంపిస్తారా..అన్నాడు..'లేదన్నా"
"అది మాత్రం కుదరదని చెప్పు.. ఈ కాలం పిల్లళాకి పెళ్ళికి ముందు తిరగాలన్న ఉబలాటం దేనికో.."
"నన్ను ఫోన్ చేయమన్నాడు..సెకండ్ టైం చేసినపుడు.."
"యేం చేస్తున్నారు..'అన్నాడు..'పక్కలేస్తున్నాను...యేం చెప్పాలో తెలియక.."
ఆ మాటే చెప్ప లేక పోయావా..ఆ తర్వాత అతనేమంటాడో చెప్పనా..'వచ్చేనా'..అని.."
మళ్ళే పగలబడి నవ్వింది సుచిత్ర..
"చక్కటి చాన్స్ మిస్ చేసావమ్మయ్..లేకపోతే అబ్బాయ్ ఓ డ్రీం సాంగన్నా వేసుకొనే వాడు..పాపం.."
"పోండాంటీ.."
"ఈంతకీ మీ ఆయన ఫోటో చూపిస్తావా లేదా..?"
"నా దగ్గర లేదాంటీ..మా నాన్న దగ్గర వుంది.."
"లేకపోవటమేంటీ..నీ గుండెల్లో..దాచుకొనే వుంటావ్..పాత కాలం హేరోయిన్లా...ఏదీ..చూడనీ.."
ఇంతలో తప్పించుకొని పరుగు తేసింది గాయత్రి...
సుచిత్ర షాపుకు గాయత్రి వస్తూంటుంది..తరచుగా..
పెళ్ళి వయసు దాటవస్తూంది అప్పుడప్పుడే..
గాయత్రి పెళ్ళి కాలేదని ఆమే అమ్మానాన్నకు దిగులూ..ఈ పిల్లకు లోలోపల గుబులూ..ఫీలింగ్స్ పంచుకొనే తోడులేదు..ఫ్రెండ్స్కు పెళ్ళిళ్ళయ్యాయి..అక్కతోనే చెప్పలేదు..అమ్మానాన్నలకేం చెప్తుందిక..
ఎందరో పెళ్ళికొడుకులు వచ్చారూ..వెళ్ళారూ..
గాయత్రి కన్య గానే..వుండిపోయింది..
కొందరికి..పిల్ల నచ్చలేదు..
కొన్నింటికి జాతకాలు కలవలేదూ..
ఉద్యోగం..ఆర్థిక పరిస్థితీ..కొన్నింటిలో..గాయత్రి నాన్నకు నచ్చలేదూ..
అన్నీ కుదరటం అరుదుమరి..
గాయత్రి తన ఫీలింగ్స్ నోరులేని ఆ దేవునికి చెప్పి.. చెప్పీ..విసిగి పోయింది..
రోజూ..గుడి ప్రదక్షిణలు ముగించుకొని.. గాయత్రి సుచిత్ర షాపుకు ఓ రౌండేసేది..
ఓ థంప్స్ అప్ తాగి కబుర్లు చెప్పి వెళ్ళేది..
ఇవ్వాళ నాలుగింటికి లేచానాంటీ..
లాంటి నీరసమైన రొటీన్ డైలాగులతో ప్రవేశించేది..
గిన్నెలు కడగటం..పూజకు పువ్వులు కోయటం..అమ్మకు వంటలో సాయం చేయటం..కూరలూ సరుకులూ..తేవటం..కరెంటు బిల్లులూ..లైబ్రరీ పుస్తకాలూ..
తనను తాను బిజీగా వుంచుకోవటంలోనో..తనను తాను తప్పించుకోవటంలోనో..గాయత్రి తలమునకలై వుండేది ఎప్పుడూ..
అరవైలలో వున్నారు ముసలివాళ్ళిద్దరూ..
ఈ పిల్లకి పెళ్ళెప్పుడౌతుందా..వారికీ మనోవేదనే..

మనసుకూ..మనసుకూ..మధ్య చెప్పలేని నిశ్శబ్దం..
"ఇవ్వాళేంటో..బోరుగా వుందాంటీ.."
"ఇవ్వాళ మనసేం బావోలేదాంటీ.."
అప్పుడప్పుడూ..దాదాపు..తరచుగా..గాయత్రి తన మనసులోని వంటరితనాన్నీ.. తన వయసు తొందరనూ..డొంకతిరుగుడుగా..వ్యక్తపరిచేది..
గాయత్రి మనస్థితిని అంచనా వేయలేని అమాయకురాలు కాదు..సుచిత్ర..
అందుకే.. కూర్చోబెట్టుకొని నాలుగు సరదా మాటలూ..నాలుగు పిచ్చి జోకులూ చెపి ఆ పిల్లను రంజింపజేయడానికి ప్రయత్నించేది..
ఇవ్వాళ పిచ్చి పిచ్చిగా వుందాంటీ..అంది ఓ రోజు..కళ తప్పిన ముఖంతో..'వెళ్తానాంటీ..'లేచింది త్వరగానే..
"ఏయ్..కూచో..ఇంటికిపోయి ఏం చేస్తావ్..? కూచోవోయ్.."
"లేదాంటీ వెళ్తాను.."
"ఏం జరిగిందమ్మా.."అనునయంగా అంది..
"ఏం లేదాంటీ.."
"నీ మనసు నాకు తెలియదా..?చెప్పు..నీ మనసులో ఏమో వుంది.."
ఆ మాత్రం చల్ల గాలికే..నీటితో బరువెక్కిన ఆ మేఘం కుండపోతగా..వర్షించింది..
"ఇవ్వాళ నాన్న తిట్టాడాంటీ.."
"ఎందుకూ..?"
మా అక్క కొడుకు వున్నాడుగా..ఎప్పుడూ..అల్లరే.. వాణ్ణీ కాచుకుని వుండాలి నేనెప్పుడూ..
ఓ దెబ్బేసినా..నాన్న కయ్యి మంటారాంటీ..
చిన్న పిల్లాడిముందు నన్ను తిడితే..వాడికి నేను మరింత చులకనవనూ..
అయినా ఒక్కటి కూడా తగిలించకుండా..వాడినెలా కంట్రోల్  చేయటం..
అర్థం చేసుకోరూ.."
ఓస్ ..ఏ మాత్రానికేనా..
అదికాదాంటీ..
ఒక్కటి చెప్పనా..నీ మనసులో బాధ అది కాదు..
అందుకే పెద్దలంటారు.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని..
నీకిప్పుడు పెళ్ళి కావాలమ్మాయ్ ఆ ఒక్కటీ అయిందనుకో..బోరుగా వుందాంటీ..ఇవ్వాళ మనసేం బావులేదాంటీ..లాంటి డైలాగులుండవు..
చిన్న చిన్న చీకాకులు మనసును బాధించవు..
కాస్త ఓపిక పత్తు గాయత్రీ..ఆ దేవుణ్ణి గట్టిగా నమ్ముకో..
నీకైనా..నాకైనా..ఆయనే దిక్కు..
గాయత్రి కళ్ళలో నీళ్ళు జల జలా రాలాయి..
అదికాదాంటీ..
నాకు తెలుసు నేనూ నీ స్తేజీ దాటి వచ్చిన దాన్నే..
ఏం సిగ్గు పడకు నిన్ను ఎగతాళి చేసో..నీ గురించి నలుగురికి చెప్పూ..నవ్వి.. సొంతోషపడే..శాడిస్టునికాను..నీ మనసులో బాధలూ..వేదనలూ..నిర్భయంగా..నాతో..చెప్పుకో..కాస్త స్వాంతన పొంది వెళ్ళు..ఇదీ ఓ రకమైన భగవత్సేవే..
కాదాంటీ మా నాన్న..
మీ నాన్నదీ పెద్ద వయసే కదా..
ఆయనకూ నీ పెళ్ళి గురించి దిగులుంటుంది..
ఆయన మాత్రం ఎవరి దగ్గర తన బాధ వెళ్ళబోసుకుంటాదూ..?
తన అసహనాన్ని వెలిబుచ్చుతాడు చెప్పూ..?
నన్ను కోప్పడితే నేనేం చేయనాంటీ..?
పాపం నాన్న..అనుకో గాయత్రీ..
సుఖపు రోజులు త్వరత్వరగా..వెళ్ళిపోతాయి..కష్టపు దినాలే..లాగటం కష్టం..

రుద్రాభిషేకాలూ..సత్యనారాయణ వ్రతాలూ..
గురువారపు సేవలూ..
ఏ దేవుడు కరుణీంచాడో..
ఏ పూజలు ఫలించాయో..
ఓ పెళ్ళి కొడుక్కు గాయత్రి నచ్చింది..
వాళ్ళ నాన్నకి ఆ అబ్బాయి ఉద్యోగం..ఆర్థిక స్థితీ నచ్చింది..
వాళ్ళమ్మకి వాళ్ళింటి సాంప్రదాయం నచ్చింది..
మొత్తానికి గాయత్రికి పెళ్ళీ కుదిరింది..
దానికి నచ్చాడో లేదో..కనుక్కో.. అన్నాట్ట వాళ్ళ నాన్న.
మొత్తానికి గాయత్రి పెళ్ళికుదిరింది..
ఏం చేయ దల్చుకున్నావ్ గాయత్రీ..
ఒప్పుకున్నానాంటీ..
తెలివైన నిర్ణయం తీసుకున్నావ్ గాయత్రీ..
ఎప్పటికే..మా నాన్న మానసికంగా చాలా అలసిపొయి వున్నాడాంటీ..ఎంకా ఆయనను బాధ పెట్టలేను..
అన్నీ కలసిన సంబంధం ఎవరికీ దొరకదు అసలుండదు కూడా..
మనలో లేవూ లోపాలూ..
అలానే వారికీ..వాళ్ళూ మనుషులే కదా..
మెత్తానికి పెళ్ళి కూతురౌతున్నవనమాట..పెళ్ళికి నన్ను పిలవాలమ్మాయ్..
మీరు రాకుండా నాకు పెళ్ళేంటాంటీ..
వెళ్ళి పోయింది గాయత్రి.
సుచిత్ర మనసు సంతోషంతో నిండిపోయింది..
పోనీలే..పాపం గాయత్రి గట్టున పడింది..
అనుకుంది తేలిగ్గా..
పెళ్ళీ పనులు చక చకా జరిగిపోతున్నాయ్..
సున్నాలూ..పెయింట్లూ..చీరలూ.. నగలూ..
సందడే..సందడి..
గాయత్రి ముఖానికి పెళ్ళ్కళ వచ్చింది..
ఎదివరకు లేని ధీమా కనిపిస్తూంది..
గాయత్రీ మీ నాన్నకు బి.పి. వుంది..హార్ట్ పేషంటు చప్పిడి కూరలూ.. నూనెలేని వంటలూ..రుచీ పచీ లేని పక్వాలూ..
మీ ఆయనకి మంచి మసాలాలు దట్టించిన కూరలూ..ఉప్పూ కారం నిండిన వంటలూ తినిపించు..జడిపించకు..
అజమాయిషీ చేసేది సుచిత్ర సరదాగా..
మా నాన్న ఫ్రేండు ఫూన్ చేసాడాంటీ.. పొద్దుటే..మా నాన్న మా అమ్మాయికి పెళ్ళి కుదిరిందోయ్... అని చెప్తూ..భూరున ఏడ్చారాంటీ..
నేను వెనక దొడ్లో వున్నా..వింటూనే వున్న్నా..అన్నీ..
ఎంతగా బాధ పెట్టానా మా నాన్నని అనిపించిందాంటీ..
కళ్ళు తుడుచుకుంది గాయత్రి..
సుచిత్ర మనసూ బరువెక్కింది..
ఎంత బాధ వుందో ఇన్నాళ్ళబట్టీ..ఆయనలో ఫ్రెండ్ కంఠంవినగానే..చిన్న పిల్లాడిలా
ఏడ్చేశారు..
కొన్ని అమ్మా నాన్నలతో చెప్పుకొనేవి వుంటాయ్ గాయత్రీ..
కొన్ని ఫ్రెండ్స్ తో చెప్పుకొనేవి..
ఏ ఫీలింగ్ నైనా పంచుకో గలిగే భర్త దొరకాలి గాయత్రీ..
అతనే పుణ్యం కొద్దీ పురుషుడు..
అతను ఎవరికో గానీ దొరకడు..
దొరికాడా..ఆ ఆడదాని జన్మ ధన్యమే..
సుచిత్ర ఫీలిగ్ గాయత్రికి అర్థం కాలేదు..
ఆ అనుభవాలూ అనుభూతులూ గాయత్రికి పరిచయం లేవు మరి..
పెళ్ళవుతూనే సమస్యలు సమాప్తం అనుకొంటూది పిచ్చి పిల్ల..
జీవిత కాలంలో పరిష్కరించలేని ఎన్నో కొత్త సమస్యలముడే కొంగుముడని గాయత్రికి ఎప్పుడే ఎలా తెలుస్తుంది..?
ముందే చెప్పి భయపెట్టడం ఎందుకు..
అయినా..
ఆ పుణ్యం కొద్దీ పురుషుడు..పురుషోత్తముడూ గాయత్రి మొగుడవుతాడేమో..
ఎవరికి తెలుసు..?
అందరికీ మంచే జరగాలని ఆశిద్దాం..
"సర్వే జనాస్సుఖినో భవంతు.."
అనుకుంది సుచిత్ర..